ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే
గద్వాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదని, సమీప ప్రత్యర్థి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కృష్ణమోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో హైకోర్టులో ఎందుకు వాదనలు వినిపించలేదని కృష్ణమోహన్‌రెడ్డిని ప్రశ్నించింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం జవాబిస్తూ.. కోర్టు నుంచి వచ్చిన నోటీసుల గురించి తమకు తెలియదని, కృష్ణమోహన్ రెడ్డి బంధువు ఆనంద్‌రెడ్డి నోటీసులను అందుకున్నారని, అందుకే తాము వాదనలు వినిపించలేకపోయామని చెప్పారు. దీంతో, ‘‘హైకోర్టులో కేసు నడుస్తున్నట్లు 2019 నుంచి 2023 వరకు మీకు తెలియదంటే నమ్మలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే మీడియాలో కేసు గురించి కథనాలు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ల కోసం తాము కోర్టులో అప్లికేషన్ వేశామని ఆర్యమ సుందరం బదులిచ్చారు. కాగా, ‘‘మెరిట్స్ ప్రకారం కృష్ణమోహన్‌రెడ్డికి ఆరు బ్యాంకు ఖాతాలు ఉండగా.. రెండింటి వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించలేదని హైకోర్టు గుర్తించింది. అలాగే, వ్యవసాయ భూమి వివరాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొనలేదు.’’ అని ధర్మాసనం ప్రస్తావించింది. సుందరం వాటిపై వాదిస్తూ.. వ్యవసాయ భూమిని 2018లోనే విక్రయించారని, అందుకు సంబంధించిన సేల్ డీడ్ ఉందని చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డికి ఐదు బ్యాంకు ఖాతాలు ఉంటే అందులో మూడు సేవింగ్స్ ఖాతాలని తెలిపారు. అఫిడవిట్‌లో డిపాజిట్ ఖాతాలు మాత్రమే పొందుపరచాలని ఉందని వివరించారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన డీకే అరుణ కొద్దిరోజుల్లోనే బీజేపీలో చేరినందున ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటించడానికి లేదని వాదించారు. డీకే అరుణ తరఫున జంద్యాల రవిశంకర్ వాదిస్తూ.. హైకోర్టు తీర్పును అనుసరించి డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. బ్యాంకు ఖాతాల వివరాలు అఫిడవిట్‌లో పేర్కొనకపోవడం ఎన్నికల చట్టాలకు విరుద్ధమన్నారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. స్టే తర్వాత ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి స్పందిస్తూ డీకే అరుణ తప్పుడు వివరాలతో హైకోర్టును తప్పుదోవ పట్టించారన్నారు. ఇందుకు ఆమెపై పోలీసు కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.