సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు. దీంతో సింగపూర్ కు మూడో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు అవుతున్నారు. గతంలో ఇద్దరు భారత సంతతికి చెందిన వారు ప్రెసిడెంట్ గా సేవలు అందించారు. సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులపై భారీ మెజార్టీతో షణ్ముగరత్నం గెలుపొందారు. సింగపూర్ వాసులు తనకే ఓటు వేస్తారని, అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని ఎన్నికలకు ముందు షణ్ముగరత్నం ముందునుంచి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో షణ్ముగరత్నానికి 70.4 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు కోక్ సోంగ్‌కు 15.7 శాతం, టాన్ కిన్ లియన్‌కు 13.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకోబ్ ఆరేళ్ల పదవీకాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది. హలీమా యాకోబ్ సింగపూర్ దేశ 8వ, మొదటి మొదటి మహిళా అధ్యక్షురాలు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో విజయంతో సింగపూర్ 9వ ప్రెసిడెంట్ గా సెప్టెంబర్ 13 తర్వాత ధర్మన్ షణ్ముగరత్నం బాధ్యతలు చేపట్టనున్నారు.
కేరళకు చెందిన దేవన్ నాయర్ 1981లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1985 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన సెల్లపన్ రామనాథన్ 2009లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు భారత సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా ధర్మాన్ షణ్ముగరత్నం ఎంపికయ్యారు.









