AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాయకుడు సాయిచంద్‌ కుటుంబానికి రూ.1.50 కోట్ల సాయం

తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం అందజేసింది. ఇటీవల గుండెపోటుకు గురై ఆయన ఆకస్మికంగా మృతి చెందగా.. సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకోవటానికి సీఎం కేసీఆర్ రూ. 1.50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు సోమవారం సాయిచంద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి భార్యా,పిల్లలకు చెక్కులు అందజేశారు.

సాయిచంద్ భార్య వేద రజనీకి రూ.50 లక్షలు, పిల్లలు చరీష్‌, మీనల్‌లకు చెరో రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి చెక్కుల రూపంలో అందజేశారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్‌ నాయకత్వమే శ్వాసగా, ఆశగా బతికిన సాయిచంద్‌.. మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని ఆ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అండగా ఉంటూ ధైర్యంగా ముందుకు నడిపిస్తున్న కేసీఆర్‌కి రజనీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక సాయిచంద్ స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింతలో ఆయన తండ్రి వెంకట్రాములుకు, చెల్లికి కూడా చెక్కులు అందజేశారు. తండ్రికి రూ.25 లక్షలు, చెల్లెలు ఉజ్వలకు రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బాల్కసుమన్‌ పాల్గొన్నారు.

ANN TOP 10