మియాపూర్ కాల్పుల కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేందర్‌పై కాల్పులు జరిపిన రిత్విక్ అలియాస్ తిలక్‌ను అరెస్ట్ చేశారు. గతంలో అదే రెస్టారెంట్లో పని చేసిన వ్యక్తి కాల్పులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు దేవేందర్ వల్లనే తన ఉద్యోగం పోయిందని కక్షతో కాల్పులు చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో దేవేందర్, రిత్విక్ ఇద్దరు ఓ రెస్టారెంట్లో మేనేజర్లగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం నిందితుడిని మాదాపూర్ డీసీపీ, మియాపూర్ పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
మదీనాగూడ సందర్శిని ఎలైట్‌లో మేనేజర్ దేవేందర్‌పై కాల్పులు కలకలం రేపింది. ఆరు రౌండ్లు ఫైరింగ్ చేయగా.. దేవేందర్ శరీరంలోకి నాలుగు బుల్లెట్స్ వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన నిందితుడి కోసం ఐదు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నిందితుడు రిత్విక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కలకత్తా వాసిగా గుర్తించారు. హోటల్ సిబ్బంది స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. కాల్పుల్లో మృతి చెందిన దేవేందర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.