– చేతగాని వారికి అధికారం ఇవ్వొద్దు
– రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ.. సంక్షేమ పథకాల లబ్ధిని పెంచుతాం
– మెదక్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
– సమీకృత కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్‌ఎస్ కార్యాలయాల ప్రారంభం
ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్‌లో ప్రగతి శంఖారావం పూరించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ భవనాలను ప్రారంభించారు. అనంతరం మెదక్ చర్చి గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రగతి శంఖారావం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పెద్ద రాష్ట్రాలను తలదన్ని తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన బీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం కట్టబెట్టాలని కోరారు. అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామన్నవారిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు సీఎం కేసీఆర్. మెదక్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్ జిల్లా ఆఫీసును ముఖ్యమంత్రి ప్రారంభించారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సీఎస్ శాంతికుమారి ఉన్నారు.
ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్ మెదక్‌జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మెదక్‌జిల్లా మున్సిపాల్టీకి 50కోట్లు, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్‌లకు 25కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో రామాయంపేట రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్‌కు రింగ్‌రోడ్డు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక్కో గ్రామపంచాయతీకి 15 లక్షలు చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఏడుపాయల దేవాలయం అభివృద్ది పనులకు వందకోట్లు రూపాయలు కేటాయిస్తామన్నారు కేసీఆర్.తెలంగాణ రాకముందు పరిపాలన చేతకాదని విమర్శించారని, పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శమన్నారు కేసీఆర్. 70 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకను కూడా అధిగమించి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
24 గంటల కరెంట్, పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పింఛను 3వేల నుంచి 4,016కు పెంచామన్నారు. తెలంగాణ రాకముందు 24 లక్షల పింఛన్లు ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ధరణిని వద్దన్న పార్టీలను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతి సాధించి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు.









