AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఊరంతా బూడిదైనా.. చెక్కుచెదరని ఇల్లు

ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌
కార్చిచ్చు చెలరేగింది. ఊరంతా తగలబడింది. అయితే ఒక్క ఇంటికి మాత్రం ఏం కాలేదు. ఆ ఇంటికి పొగ మసి కూడా అంటలేదు. ఆ ఇంటి ముందు,వెనుకా చెట్టూపుట్టా అంతా కాలిబూడిదైపోయినా కూడా ఆ ఒక్క ఇల్లు మాత్రం ఎలా ఉండేదో అలాగే ఉంది. చుట్టూ తగలబడిన ఊరు మధ్యలో చెక్కుచెదరకుండా ఉన్న ఆ ఇంటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మంటల్లో కూడా చెక్కుచెదరకుండా మిగిలి ఉన్నా ఆ ఇల్లు ఎక్కడ ఉంది?ఆ ఇంటికి ఎందుకు ఏం కాలేదు?

అసలేం జరిగింది
అమెరికాలోని హవాయి మౌవి దీవిలో 10 రోజుల క్రితం చెలరేగిన భీకర కార్చిచ్చుకు లహైనా రిసార్ట్ టౌన్ బూడిద దిబ్బగా మారింది. 114 మంది ఈ కార్చిచ్చు కారణంగా చనిపోగా, 850 మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు తెలిపారు. హవాయి చరిత్రలోనే ఇది అతి పెద్ద ప్రకృతి విపత్తుగా పరిగణిస్తున్నారు. అయితే వేగంగా వ్యాపించిన మంటల ధాటికి లహైనా పట్టణంలోని చుట్టూ తగలబడి ఉన్న ఇళ్లు,చెట్ల మధ్యలో ఓ రెండంతస్థుల రెడ్ రూప్ బిల్డింగ్ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. ఆ ఇంటిని అగ్గి ముట్టుకోలేదు. ఊరంతా,చుట్టుపక్కల అన్ని ఇళ్లు కాలిబూడిదైపోయినా కూడా ఫ్రంట్ స్ట్రీట్‌లో ఉన్న వందేళ్ల నాటి చెక్క ఇంటిని అగ్గి ముట్టుకోలేదు. ఆ ఇంటికి రవ్వంత నష్టం కూడా జరగలేదు. ఈ ఇంటి ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

కార్చిచ్చు సమయంలో ఆ బిల్డింగ్ ఓనర్ కుటుంబంతో కలిసి మసాచుసెట్స్ కి విహారయాత్రకు వెళ్లారు. తమ ఇల్లు కూడా కార్చిచ్చులో తగలబడిపోయిందని అనుకున్నామని,కానీ ఏరియల్ ఫుటేజ్ లో తమ ఇంటికి ఏం కాలేదని చూసి తాము ఆశ్చర్చపోయాం అని ఆ ఇంటి ఓనర్ మిలికన్ చెప్పారు. తమ ఇంటికి ఏ కారణం చేత మంటలు అంటుకోలేదో తమకు కెరెక్ట్ గా తెలియదన్నారు. మంటల నుంచి కాపాడేందుకు ఇంటిలో ప్రత్యేకంగా ఏమీ లేదన్నారు. రెండేళ్ల క్రితమే తాము ఈ ఈ ఇంటిని కొనుగోలు చేశామని,ఇంట్లో పెద్దగా మార్పులు చేయలేదని,తారుతో ఉన్న ఇంటి పైకప్పు స్థానంలో భారీ బరువుండే మెటల్ తో పైకప్పు ఏర్పాటు చేయించామన్నారు. ఇంటి చుట్టూ రాళ్లు పెట్టామని, దాని చుట్టూ ఉన్న ఆకులను తొలగించామన్నారు. కానీ, ఇవేమీ కూడా ఇంటిని మంటలకు అంటుకోకుండా ఆపలేవని, ఇది 100 శాతం చెక్క ఇల్లు అని ఆమె తెలిపారు. తాము ఇంటిని కొనుగోలు చేయడానికి ముందు చెరుకు పంటల ఉద్యోగుల కోసం బుక్‌ కీపర్స్ హౌస్‌గా దీన్ని వాడేవారని తెలిపారు. తమకు ఇల్లు మరమ్మతులు లేకుండా ఇచ్చారు.. దాంతో తాము ఇంటిని పునరుద్ధరించాలని కోరామని.. ఈ మరమ్మతులు ఇంటిని కాపాడి ఉండొచ్చని అన్నారు. పక్క ఇళ్లకు ఈ ఇల్లు దూరంగా ఉండటం కూడా మంటలు అంటుకోకపోవడానికి కారణమై ఉండొచ్చని ఆమె తెలిపారు.

ANN TOP 10