కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన వారికి గృహలక్ష్మి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్టు మంత్రి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించిన సందర్భంగా.. పెద్దఎత్తన వరదలు పోటెత్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయితే.. సిబ్బంది కృషి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం భారీగా తగ్గిందన్నారు. రెవెన్యూ, పోలీసు సిబ్బంది చాలా కృషి చేశారన్నారు. వరదల్లోనూ ప్రాణాలకు తెగించి.. ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సిబ్బంది పనులు చేసినట్టు గుర్తు చేశారు. మిషన్ భగీరథ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి.. నీటి సరఫరాను పునరుద్ధరించారన్నారు.
అయితే.. రాష్ట్రవ్యాప్తంగా 150 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వరదల ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించినట్టు ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 770 నివాసాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి తెలిపారు. 139 గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందన్నారు. ఆయా గ్రామాల్లో 419 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయని, 7500 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ వరదల వల్ల కూలిపోయిన ఇళ్ల వారికి గృహలక్ష్మి పథకం ఆర్థికసాయం అందిస్తామని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేస్తున్నారని మంత్రి తెలిపారు. అన్ని శాఖల నివేదికలు వచ్చిన తర్వాత పంట నష్టం పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.









