AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించాలని కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రవేశపెట్టగా.. నేడు దీనికి ఆమోదం తెలుపుతూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ బిల్లుకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసన తెలపడం, సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో.. బుధవారం సభ వాయిదా పడింది. గురువారం కూడా ఈ బిల్లుపై వాడీవేడీగా చర్చ సాగింది. దీనికి ఆమోదం తెలపకూడదని ప్రతిపక్షాలు గట్టిగానే డిమాండ్ చేశాయి. ఇలా ప్రతిపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు.

దీంతో ప్రతిపక్షాలు వెంటనే సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింక్ అయితే.. లోక్‌సభలో బిల్ పేపర్లను చింపేసి, వెల్‌లోకి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన స్పీకర్.. ఆయన్ను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాల పూర్తయ్యేంత వరకు సభ కార్యక్రమాలకు హాజరు కాకుండా సస్పెన్షన్ విధించారు. మరోవైపు.. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే, దేశ రాజధానిలో బ్యూరోక్రాట్లను ఎవరు నియంత్రిస్తారనే దానిపై బిల్లును తీసుకొచ్చామని అమిత్‌షా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా సమస్యపై చట్టాలు చేసే హక్కు ఉందని సుప్రీంకోర్టు ఆదేశాలు చెబుతున్నాయని.. ఢిల్లీ కోసం చట్టాలు చేసేందుకు కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.

ANN TOP 10