భారీ వర్షాల నేపథ్యంలో నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని, సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. భద్రాచలంలో ముంపునకు అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. గతంలో వరదల సందర్భంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సీఎం తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్ళి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా వుండాలని సీఎం ఆదేశించారు. వర్షాలు, వరద సహయ చర్యల కోసం రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూం సహా హెలికాప్టర్లు, సంబంధిత సహాయక చర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికార యంత్రాంగం, భద్రాచలంలో సహాయక చర్యలు చేపట్టారు.









