రాజస్థాన్ జైపూర్ ను వరుస భూకంపాలు కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మూడు భూకంపాలు కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సంభవించాయి.
దీంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూ కంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే భూకంపం తీవ్రత తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. కాగా భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలను ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు అరగంట వ్యవధిలోనే భూమి మూడు సార్లు కంపించడంపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పందించారు. ‘జైపూర్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. మీరందరూ (ప్రజలు) క్షేమంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను!’ అంటూ ట్వీట్ చేశారు.









