వివిధ పార్టీల నాయకుల చేరికలపై విస్తృతంగా చర్చ
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో బుధవారం కీలక సమావేశం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పరిస్థితి, పార్టీలోకి చేరికలు, ప్రచార వ్యూహంపై చర్చించారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఎమ్మెల్యే సీటుపై హామీ ఇస్తేనే పార్టీలోకి వస్తామని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. దీంతో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతల గురించి విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. పలువురి చేరికలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారంపై చర్చించారని సమాచారం. ప్రచారంలో అమలు చేయాల్సిన వ్యూహలు, సీట్ల కేటాయింపు, ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి తీగల కృష్ణారెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. వారిని చేర్చుకునే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.
బుధవారం సాయంత్రం మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య గురువారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో రేవంత్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లకముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.









