AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాబోయ్‌ ఎండలు.. ఒక్కసారిగా 66.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదు.. ఎక్కడంటే..

ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా సహా అనేక ప్రాంతాల్లో హీట్​వేవ్​ పరిస్థితులు ప్రజలను భయపెడుతున్నాయి. కొన్ని దేశాల్లో రికార్డుస్థాయిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో రెడ్​ అలర్ట్​లు అమల్లో ఉన్నాయి.

వాతావరణ మార్పులు ప్రపంచంపై ప్రతికూల ప్రభావానికి అద్ధం పట్టే మరో సంఘటన ఇది. ఇరాన్‌లోని (Iran) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఉష్ణ సూచిక (Heat Index) పై ఏకంగా 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. అధిక ఉష్ణోగ్రతకు వాతావరణంలోని తేమ తోడు కావడంతో అత్యంత వేడి నమోదైనట్టు అమెరికాకు చెందిన వాతావరణ నిపుణుడు కోలిన్‌ మెక్‌‌కార్తి వెల్లడించారు. ఇరాన్‌ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హీట్ ఇండెక్స్ 66.7 డిగ్రీల సెల్సియస్‌‌గా నమోదయినట్టు ట్విట్టర్‌లో తెలిపారు. ఇది మనుషులు, జంతువులు భరించలేని తాపమని చెప్పారు.

మెక్‌కార్తీ పేర్కొన్న సమయానికి పర్షియన్ గల్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా.. సాపేక్ష ఆర్ద్రత 65 శాతంతో కలిపి 66.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం జులై నెలలో 10 రోజులు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో అమెరికా, ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫ్లోరిడాలో అట్లాంటిక్‌ మహాసముద్ర జలాలు 32.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. చైనాలోని శాన్‌బో టౌన్‌షిప్‌లోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ నేపథ్యంలో తక్షణమే భూతాపాన్ని నియంత్రించే చర్యలు తీసుకోకపోతే అది మానవులకు ఓ నరకంగా మారే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ వాతావరణ విభాగం చీఫ్ డాక్టర్ అక్షయ్ డియోరస్ ఆందోళన వ్యక్తం చేశారు.

ANN TOP 10