రాష్ట్రవ్యాప్తంగా పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక లక్షా 36 వేల మందికి పోడు పట్టాలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని సీఎం చెప్పారు. పోడు భూములకు పట్టాలు పొందిన రైతులకు ఇతర రైతులకు మాదిరిగానే రైతుబంధు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పోడు పట్టాలను మహిళల పేరు మీదనే ఇస్తున్నట్లు తెలిపారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం మాత్రమే కాదని, ఈ భూములకు సంబంధించి గతంలో గిరిజనులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు. ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్ కరెంటు ఇస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 51 మంది రైతులకు నాలుగు లక్షల 50 వేల ఎకరాల పోడు భూమిని పట్టాలు ఇచ్చి పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా సహకరించారని సీఎం గుర్తుచేసుకున్నారు.









