బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ నుంచి వెళ్లిపోవాలని కోరుకునేవారు కొంతమంది ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. వాళ్ళ ఖర్మ అని, దానికి తానేం చేయలేనని తెలిపారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారని, వాళ్లెవరో కూడా ఇప్పటికే అందరికీ తెలుసంటూ చెప్పారు. తనను కించపరిచేవారు కూడా కొంతమంది పార్టీలో ఉన్నారని, వాళ్ల గురించి తాను పట్టించుకోనని ఈటల స్పష్టం చేశారు.
బట్టలు మార్చినంత ఈజీగా తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, కొందరు చిల్లరగాళ్లు కోరుకున్నట్లుగా తాను ఈజీగా నిర్ణయం తీసుకోనని ఈటల రాజేందర్ చెప్పారు. తాను ఎప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతానా అని తమ పార్టీలోనే కొందరు ఎదురుచూస్తున్నారన్నారు. భగావో అని చెప్పేవాళ్లు ఉన్నారని, అవమానించేవాళ్లు కూడా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనను బయటకు పంపిస్తే.. బీజేపీ అక్కున చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కేసీఆర్ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని ఈటల ఆరోపించారు.
‘రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌కు అహంకారం పెరిగింది. చిన్న రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదు కానీ ఇంకేదో చేస్తారట. కేసీఆర్ పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ధరణితో లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధరణి లక్షలమంది కొంపముంచింది. ధరణి వల్ల ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభం జరిగింది. తెలంగాణలో త్రిముఖ పోటీ ఉండే అవకాశం అసలు లేదు. ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ప్రజలకు మంచి చేసే పథకాలను ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎత్తివేయవు. ప్రజలు ఒడగొట్టిన సైకో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు’ అని ఈటల పేర్కొన్నారు.









