తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిస్థితులను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు కార్యక్రమాలను కేంద్రమంత్రి రద్దు చేసుకున్నారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డితో పార్టీ హైకమాండ్ భేటీలో కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి ఈటల, రాజగోపాల్ చేరుకున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా… గత కొంతకాలంగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం, ఈటల వర్గానికి దూతగా కిషన్‌రెడ్డిని అధిష్టానం పిలిచినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సయోద్య కుదిర్చేందుకు కిషన్‌రెడ్డిని ఉపయోగించుకోవాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు తెలంగాణకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలను కాషాయ పార్టీ హైకమాండ్ సెట్ చేసే పనిలో పడింది. రేపు (ఆదివారం) ఉదయం పార్టీ ముఖ్య నేతలతో నడ్డా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.