640 మంది దుర్మరణం
ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం
రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదు
టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి విలయం సృష్టించింది. భారీ భూకంప తీవ్రతతో వేలాది భవనాలు కుప్పకూలాయి. రెండు దేశాల్లో అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. టర్కీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు ఈ భారీ భూకంపం సంభవించింది.
ఆగ్నేయ టర్కీలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో దక్షిణ టర్కీ ప్రాంతం ఉత్తర సిరియాలోని పలు ప్రాంతాల్లో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ రెండు దేశాల్లో ఇప్పటివరకు 640 మందికి పైగా మృత్యువాత పడ్డారు. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపంతో వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంటున్నారు. కుప్పకూలిన భవనాల్లో వందల సంఖ్యలో ప్రజలు ఉన్నారని చెబుతున్నారు.
ప్రధానంగా టర్కీలోని దియర్ బకీర్ సిరియాలోని అలెప్పో హమా నగరాల్లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.