తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పెద్దగూడెం తండాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పర్యటించిన ఆయన, ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కరవని ఆయన విమర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులతో నిరంజన్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎల్ నినో పేరు చెప్పి ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టాలను వెంటనే అంచనా వేసి, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టులో 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, పాలమూరు, కల్వకుర్తి పంపులను ప్రభుత్వం నడపడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరాపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో సుమారు 2.5 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. నష్టపరిహారం అందేవరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.







