తెలంగాణలోని పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గడ్కరీ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తీరనున్నాయి. వీటితో పాటు, కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్‌ల శంకుస్థాపన ప్రతిపాదనకు కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనపై కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇదే క్రమంలో, నవంబర్ 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ఇండియన్ రోడ్’ కాంగ్రెస్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గడ్కరీని ఆయన ఆహ్వానించారు.







