AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘రామాయణ’ నుంచి మరో సర్‌ప్రైజ్‌..! జటాయువుగా ఆ స్టార్..!

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ: పార్ట్-1’ నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ‘జటాయువు’ పాత్రకు సంబంధించిన తొలి పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఈ పాత్రకు తన గొంతును అందించనున్నారు. ‘ది వింగ్స్‌ ఆఫ్‌ ధర్మ’ (ధర్మ రెక్కలు) పేరుతో విడుదలైన పోస్టర్‌లో జటాయువు తీక్షణమైన చూపులు ఆకట్టుకుంటున్నాయి. మరో దృశ్యంలో ఆ భారీ పక్షి రెక్కలు విప్పి కనిపిస్తోంది.

ఈ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్న చిత్రబృందం.. రావణుడు సీతను అపహరించినప్పుడు అతడిని ఎదిరించేందుకు జటాయువు చూపిన ధైర్యాన్ని గుర్తుచేసింది. విజయం కోసం కాకుండా ధర్మం కోసం పోరాడిన వీరుడిగా జటాయువును అభివర్ణించింది. సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే పలు పాత్రల పోస్టర్లను విడుదల చేయగా.. తాజాగా జటాయువు పోస్టర్‌ను పరిచయం చేసింది.

నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నీ డియోల్‌, లక్ష్మణుడిగా రవిదూబే నటిస్తున్నారు. నమిత్‌ మల్హోత్రాకు చెందిన ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌.. డీఎన్‌ఈజీ, యశ్‌ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘రామాయణం’ తొలి భాగాన్ని 2026 నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కానుంది.

ఇటీవల ముంబైలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి అంతర్జాతీయ యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ హాజరయ్యారు. రణ్‌బీర్‌, సాయిపల్లవి, నిర్మాత నమిత్‌ మల్హోత్రా కూడా పాల్గొన్నారు. అయితే కార్యక్రమం సుమారు నాలుగు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మీడియా ప్రతినిధుల నుంచి విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, శ్రీరాముడి పాత్ర కోసం రణ్‌బీర్‌ మాంసాహారం, మద్యానికి దూరంగా ఉన్నారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ మార్పులన్నీ ప్రత్యేకంగా సినిమా కోసమే చేశారనే విషయంపై స్పష్టత లేదు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నంలో భాగంగా శాకాహారాన్ని స్వీకరించడం, మద్యం, ధూమపానాన్ని మానేయడం గురించి రణ్‌బీర్‌ గతంలో మాట్లాడారు.

ANN TOP 10