AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ స్థానిక సమరం..! కూటమిలో సీట్ల సర్దుబాటుపై తీవ్ర కసరత్తు..!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాలపై మంతనాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మంగళవారం నాడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు తారాస్థాయికి చేరాయి. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్టోబర్ 14న ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చన్న అంచనాల నేపథ్యంలో, ఆ లోపే పంపకాలను పూర్తి చేసి ఐక్యంగా బరిలోకి దిగాలని కూటమి భావిస్తోంది.

ఈ క్రమంలో భాగంగా నేడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ముఖ్యమంత్రి చంద్రబాతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో వీరి మధ్య ఇది రెండో దఫా చర్చలు కావడం గమనార్హం. అయితే, బీజేపీతో చర్చలను కొలిక్కితెచ్చే ముందు, జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై ఒక స్పష్టతకు రావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం, పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, వంశీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా సమాచారం ప్రకారం, మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన నేతలు మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన నగరపాలక సంస్థల మేయర్ అభ్యర్థుల ఎంపికపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన, బీజేపీలు తమ బలాబలాల ఆధారంగా ఆశిస్తున్న స్థానాల జాబితాను చంద్రబాబుకు అందజేశాయి. పార్టీల గెలుపు అవకాశాలను బట్టి సీట్ల కేటాయింపు ఉంటుందని కూటమి వర్గాలు చెబుతున్నాయి. గత వారం కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల పంపకాలు, ఎన్నికల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో సమన్వయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

ఈ చర్చల నేపథ్యంలో, అక్టోబర్ 11న పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూటమి ఏర్పాటు, విజయం కోసం జనసేన, జనసైనికులు ఎన్నో త్యాగాలు చేశారని, ఆ త్యాగాలకు గుర్తింపుగా మిత్రధర్మాన్ని అనుసరించి స్థానిక సంస్థల్లో తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. “2024 ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడాం. ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు జనసైనికుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయని ఆశిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. 

2014లో కూడా జనసైనికులు త్యాగాలు చేశారని పవన్ తెలిపారు. “2014లో కూటమికి మద్దతుగా నిలిచినప్పుడు ఒక్క జనసైనికుడు కూడా పదవి ఆశించలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని నిస్వార్థంగా పనిచేశారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పార్టీ కోసం, కూటమి కోసం ఎన్నో త్యాగాలు చేశారు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా, స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ శ్రేణులకు న్యాయం జరగాలనే సంకేతాన్ని పవన్ బలంగా పంపారు. దీంతో సర్దుబాటు ప్రక్రియలో జనసేన డిమాండ్లకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది

ANN TOP 10