తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సాంస్కృతిక అస్థిత్వానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ తొమ్మిది రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, యువతులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
సంప్రదాయ వస్త్రాలు ధరించిన మహిళలు, తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకుని ఆలయాలు, సామూహిక ప్రదేశాలకు తరలివచ్చారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, చప్పట్లతో సందడి చేశారు. చారిత్రక హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, శిల్పారామంలోనూ ఉత్సవాలు నిర్వహించారు.
నేడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు, అక్టోబర్ 18న జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అక్టోబర్ 20న దసరా పండుగ జరగనుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, నైవేద్యం ఉంటుంది.
ఈ ఉత్సవాల కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కూడళ్లను, ప్రభుత్వ కార్యాలయాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించింది. అక్టోబర్ 18న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ప్రధాన సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సచివాలయం సమీపంలోని అమరవీరుల స్థూపం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా బయలుదేరి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చే ప్రజల కోసం ట్రాఫిక్ మళ్లింపు, బారికేడ్ల ఏర్పాటు వంటి పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలల్లోనూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తంగేడు, గునుగు వంటి సంప్రదాయ పూలతో బతుకమ్మలను పేరుస్తూ, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతున్నారు.









