AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ హైస్పీడ్ రైల్..! కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!

హైదరాబాద్ కేంద్రంగా నిర్మించ తలపెట్టిన మూడు హైస్పీడ్ రైల్ కారిడార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం అలైన్‌మెంట్ అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయని, భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదని స్పష్టం చేసింది. ఈ దశలో హైస్పీడ్ రైల్ పేరుతో ఎవరైనా భూసేకరణకు పాల్పడితే అది చట్టవిరుద్ధం అవుతుందని స్ప‌ష్టం చేసింది.

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె హైస్పీడ్ రైల్ కారిడార్ల పురోగతిపై చర్చించారు. సమావేశం అనంతరం ఈ వివరాలను కిషన్ రెడ్డి ‘ఎక్స్‌’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.

“రైల్వే మంత్రి స్పష్టం చేసిన దాని ప్రకారం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి భూసేకరణ అభ్యర్థనలు పంపలేదు. ఈ దశలో హైస్పీడ్ రైల్ పేరుతో జరుగుతున్న ఏ భూసేకరణ అయినా చట్టవిరుద్ధం” అని కిషన్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్టుల అలైన్‌మెంట్ ఖరారైన తర్వాతే ఆ వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలతో, రైతులతో పంచుకోవడం జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రైల్ కారిడార్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూసేకరణ ప్రయత్నాలను కొందరు రైతులు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ స్పష్టత రావడం గమనార్హం.

మరోవైపు కిషన్ రెడ్డితో జరిగిన సమావేశంపై దక్షిణ మధ్య రైల్వే కూడా స్పందించింది. హైదరాబాద్‌ను మూడు ప్రధాన నగరాలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్ కనెక్టివిటీకి సంబంధించిన ప్రతిపాదిత అలైన్‌మెంట్‌పై ఇరువురు మంత్రుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని సోషల్ మీడియాలో పేర్కొంది.

ఇదిలా ఉండగా, భారతీయ రైల్వేలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జూలై వరకు బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 1.14 లక్షల కోట్లకు పైగా మూలధన వ్యయం చేసినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. అలాగే, దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘కవచ్’ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ఏటీపీ) వ్యవస్థను 2,633 రూట్ కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి లోక్‌సభలో తెలిపారు.

ANN TOP 10