ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో… రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఆమోదించిన వివరాల ప్రకారం… స్థానిక సంస్థల్లో వివిధ పదవులకు కొత్త బీసీ రిజర్వేషన్ల శాతాలను ఖరారు చేశారు. ఇందులో మేయర్లకు 35.29 శాతం, మున్సిపల్ ఛైర్‌పర్సన్లకు 33.02 శాతం, పట్టణ వార్డు సభ్యులకు 32.78 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అలాగే, సర్పంచ్‌లకు 27.95 శాతం, ఎంపీటీసీలకు 25.55 శాతం, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు 24.60 శాతం చొప్పున కోటా కేటాయించారు. జెడ్పీ ఛైర్‌పర్సన్లకు మాత్రం 23.08 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు తీర్పును గౌరవిస్తూ, నిబంధనలకు అనుగుణంగా బీసీలకు లబ్ధి చేకూర్చేలా ఈ రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్ల కన్నా ఇవి మెరుగ్గా ఉన్నాయని వారు పేర్కొన్నారు. చట్టపరంగా రిజర్వేషన్లు అందిస్తూనే, కూటమి పక్షాల మధ్య సీట్ల పంపకాల ద్వారా మొత్తం మీద 34 శాతం ప్రయోజనం బీసీలకు దక్కేలా చూస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.








