ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. జరిగిన అక్రమాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి, సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత రాజ్యాంగానికి మించింది ఏదీ లేదని, ఏ ఒక్క భారత పౌరుడి ఓటు హక్కును హరించలేరని ఆయన స్పష్టం చేశారు. ఒక వ్యక్తిని కాపాడటం కోసం 140 కోట్ల మంది భారతీయుల హక్కులను ఎలా కాలరాస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును బలహీనపరిచే కుట్రలపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
SIR ప్రక్రియలో భాగంగా, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, రేపు హైదరాబాద్‌లోని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఈ ఆందోళనలను భవిష్యత్తులో ఢిల్లీకి కూడా విస్తరిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.








