AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జనసేన ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు కమిటీ..!

జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై వస్తున్న ఆరోపణల వ్యవహారంపై డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు పవన్ కల్యాణ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది.

గత కొంతకాలంగా ఎమ్మెల్యే బాలరాజు వ్యవహారశైలి, పనితీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల మీడియాలో ఆయనపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. గతంలోనే బాలరాజును పార్టీ కార్యాలయానికి పిలిపించి, గిరిజన ప్రజలకు పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించాలని, వారి సేవకే అంకితం కావాలని పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా సూచించారు. అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై పవన్ తీవ్ర అసహనం, విసుగుతో ఉన్నట్లు పార్టీ ప్రకటనలో పేర్కొన్నారు.

ఓవైపు ‘అడవితల్లి బాట’ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పార్టీ కృషి చేస్తుంటే, అదే గిరిజన ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి వ్యవహారశైలిపై వస్తున్న ఆరోపణలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఈ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఈ కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గు తేల్చి, పార్టీ అధ్యక్షుడికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై తదుపరి చర్యలు ఉంటాయని జనసేన పార్టీ స్పష్టం చేసింది. దీంతో బాలరాజు రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.

ANN TOP 10