ఢిల్లీలో ఒక అత్యంత అరుదైన వైద్య వింత వెలుగులోకి వచ్చింది. సంతానలేమి సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 26 ఏళ్ల యువకుడి శరీరంలో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉండటాన్ని గుర్తించిన వైద్యులు విస్మయానికి గురయ్యారు. సాధారణ పరీక్షల క్రమంలోనే ఈ వింత విషయం బయటపడింది.
ఢిల్లీకి చెందిన సదరు యువకుడు సంతాన సంబంధిత సమస్యలతో వైద్యులను సంప్రదించగా, అతనికి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ తరుణంలో పొత్తికడుపులో మహిళలకు ఉండే గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నట్లు తేలింది. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్’ అని పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. జన్యుపరంగా పురుషుడైనప్పటికీ, వారి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా అభివృద్ధి చెందడం ఈ సిండ్రోమ్ యొక్క ప్రధాన లక్షణం.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇలాంటి కేసులు 300 కంటే తక్కువగానే నమోదయ్యాయని వైద్య నిపుణులు వివరించారు. ఇది అత్యంత అరుదైన స్థితి కావడంతో దీనిని గుర్తించడం కూడా కష్టతరమని వారు పేర్కొన్నారు. అనంతరం వైద్యులు ఆ యువకుడికి శస్త్రచికిత్స నిర్వహించి, గర్భాశయ సంబంధిత భాగాలను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.









