ఏపీలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోందా? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముహూర్తం పెట్టేసుకున్నారా? జూన్‌లో ప్రకటన చేస్తానని చెప్పినా, దాదాపు మూడు నెలలు ఆలస్యం వెనుక ఏం జరిగింది? ఇటీవల మీడియా ముందుకొచ్చి ఆయన, వైసీపీ కోటరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
సీనియర్ రాజకీయ నేత విజయసాయిరెడ్డి కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. సెప్టెంబర్ ఏడున అనగా సోమవారం దీనిపై ఓ ప్రకటన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక ప్రకటన చేయనున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీల విధానం సామాన్యుడి సంకల్పాలు, ఆకాంక్షలు, ప్రయోజనాలను ప్రతిబింబించడంలో ఎలా విఫలమవుతున్నాయో వివరిస్తానన్నారు. ప్రజల ప్రయోజనాలను కేంద్రంగా ఉంచే ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఎందుకు అవసరం అనేదానిపై సమావేశంలో చెప్పనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మీడియా మిత్రులను ఆహ్వానించారు.
తాను లేవనెత్తబోయే సమస్యలకు అవసరమైన కవరేజీని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. జూన్‌లో రాజకీయ పార్టీ గురించి ప్రకటన చేస్తానని ఆ మధ్య చెప్పారు విజయసాయిరెడ్డి. మరి ఏం జరిగిందో తెలీదు, గతవారం మీడియా ముందుకొచ్చిన ఆయన, వైసీపీ కోటరీపై శివాలెత్తారు. ఆ పార్టీని చీల్చి చెండారారు.
మరుసటి రోజు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇకపై ఆయన గురించి మాట్లాడనని తేల్చేశారు. తానే కాదు, పార్టీ నేతల ఎవరూ మాట్లాడరని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వీఎస్ఆర్ నుంచి శనివారం ప్రకటన వచ్చింది. మీడియా సమావేశంలో వైసీపీపై ఆయన విరుచుకుపడడం ఖాయమని ఆ పార్టీలోని ఓ వర్గం బలంగా చెబుతోంది.
కొత్త పార్టీతోపాటు డిజిటల్ మీడియా ఏర్పాటు చేయాలన్నది వీఆర్ఎస్ ప్లాన్. అందుకు అనుగుణంగా తెర వెనుక పనులు చక్కబెడుతున్నట్లు ఆయన వర్గీయులు అంటున్నారు. ఈ దెబ్బకు వైసీపీ గిలగిల కొట్టుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఎటుచూసినా ఈసారి ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.







