అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగా నిత్యం వార్తల్లోకి ఉండాలనుకునే వ్యక్తుల్లో ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ ఒకరు. ఆ విధంగా అడుగులు వేస్తుంటారు. లోకల్, స్టేట్, ఇంటర్నేషనల్ వ్యవహారం ఏదైనా రంగంలోకి దిగేయడం ఆయనకు అలవాటు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినప్పుడు, వెంటనే ఏకే పాల్ రంగంలోకి దిగారు. తన పార్టీలోకి రావాలని సురేఖను ఆహ్వానించారు ఆయన.
అంశం ఏదైనా అనర్గళంగా మాట్లాడడంతో ప్రజాశాంతి చీఫ్ కేఏ పాల్ దిట్ట. రాజకీయాలైనా, ఇతర దేశాలతో దౌత్య సంబంధాలైనా ముందు నేనున్నానని అంటారు. వీలైతే ప్రధాని కూడా వెళ్లి కలుస్తానని అంటున్నారు. తాజాగా తెలంగాణలోని కొండా సురేఖ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వార్తల్లోకి వచ్చేశారు కేఏ పాల్. గడిచిన వారం రోజులుగా కొండా సురేఖ ఎపిసోడ్ రచ్చగా మారింది.
పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేఏపాల్, ఆమెని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు ముఖ్యమంత్రి లేఖ రావడంతో ఠక్కున లైమ్ లైట్‌లోకి వచ్చేశారు ప్రజాశాంతి చీఫ్. కొండా సురేఖను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. ప్రజాశాంతి పార్టీ ఉండగా మీరు ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కేవలం బీసీ నాయకుల పదవులకే ప్రమాదమని వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అది ప్రజాశాంతి పార్టీ ద్వారా సాధ్యమవుతుందని మనసులోని మాట బయపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకు ప్రాధాన్యత ఇస్తూ మిగతా వర్గాల వారిని అణచి వేస్తున్నారని ఆరోపించారు.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు పాల్. కొండా సురేఖ శక్తివంతమైన నాయకురాలని, ఆమెకు పార్టీ వేదికను అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలోని బీసీలకు న్యాయం చేయగల ఏకైక రాజకీయ వేదిక ప్రజాశాంతి పార్టీయేనని తేల్చేశారు. కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెప్పుకొచ్చారు.








