AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంచల్ గూడ జైలుకు ట్రెయిని ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి..!

తోటి ట్రెయినీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డడన్న కేసులో ట్రెయిని ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి (33) ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రెయినింగ్ లో ఉన్నాడు.

 

ఐపీఎస్ ట్రెయినింగ్‌లో..

గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన ఆయన 2025లో యూపీఎస్సీ సాధించి ఐపీఎస్ బ్యాచ్‌కి ఎంపికయ్యాడు. 2025 మధ్యలో ఇన్ స్టాగ్రామ్ లో తాను ఐపీఎస్ సాధించిన దానికి సంబంధించి ఆయన పెట్టిన పోస్టుకు అదే అకాడమీలో ఐపీఎస్ ట్రెయినింగ్ లో ఉన్న ఓ మహిళా అధికారిణి స్పందించింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. ఉదయ్ కృష్ణారెడ్డి తన సాధారణ కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ ఆమెతో సాన్నిహిత్యం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఆ తర్వాత ఆధిపత్య ధోరణి కనబరుస్తూ ఆమెను భావోద్వేగ వేధింపులుకు గురి చేశాడు. తరచూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం, ఆయుధాలు చూపి భయపెట్టడం, ఆమెను అవమానించడం, బహుళ సంబంధాల కోసం ఒత్తిడి చేయడం లాంటి చర్యలకు పాల్పడ్డాడు.

నకిలీ సోషల్ మీడియా ఖాతాలు..

అంతేకాకుండా ఆమె లాప్‌టాప్‌ను ధ్వంసం చేయడం, సోషల్ మీడియాలో బ్లాక్ చేసినా నకిలీ ఖాతాలు తెరవడం, ప్రైవేట్ చాట్‌లను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు సంబంధాన్ని తెంచుకుని మరొకరిని వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న నిందితుడు మరింత పగతో నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రైవేట్ సంభాషణలను బయటపెడతానని బెదిరించాడు. దాంతో బాధితురాలు ఇటీవల అతనిపై అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని ఆరాంఘర్ ఎక్స్ రోడ్స్ వద్ద అత్తాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరిపించి రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలోని 25వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.

ANN TOP 10