ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేసింది. కేవలం ఐటీ సెక్టార్ కాకుండా విమాన, స్పేస్ విభాగంలో భారీ పెట్టుబడులు రప్పించాలని ఆలోచన చేస్తోంది. ఆస్ట్రోబేస్ కంపెనీ దేశంలో తొలిసారిగా ప్రైవేటు రంగంలో 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది కేంద్రప్రభుత్వం. దీని విషయంలో విదేశీ ప్రయోగ సేవలపై ఆధార పడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. ప్రపంచ అంతరిక్ష కేంద్రంగా భారత్ మారాలన్న లక్ష్యానికి అడుగులు పడుతున్నాయి. దీనివల్ల ప్రైవేట్ ఆవిష్కరణలను ప్రోత్సహించనుంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రోబేస్ స్పేస్ కంపెనీ ఏపీలో టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన స్పేస్ సిటీ కల సాకారం అవుతుందన్నారు. ఆ కంపెనీ తన పనులు వేగంగా చేస్తోందన్నారు. తాము స్పేస్ సిటీ నిర్మిస్తామని చెప్పినప్పుడు చాలామందికి అనేక సందేహాలు వచ్చాయన్నారు.
మంత్రి లోకేష్ ప్రకటన, ముందుకొచ్చిన ఆస్ట్రోబేస్ కంపెనీ
ఇవాళ ఆ కల రూపు దిద్దుకుంటోందని వెల్లడించారు. ఏపీలో ఆస్ట్రోబేస్ కంపెనీ 200 టన్నుల థ్రస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల స్పేస్ సిటీలో అభివృద్ధిలో ముందు అడుగు పడింది. అంతేకాదు ఈ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు ఏపీ చిరునామాగా మారనుంది.
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో సుమారు 2,600 ఎకరాల్లో స్పేస్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాంతం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి ఎయిర్ పోర్టుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ FFSC ఇంజిన్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించింది ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్. దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇదొక మైలురాయి. పునర్వినియోగ ప్రయోగ వాహనాల కోసం రూపొందించిన అధిక థ్రస్ట్ మీథేన్ ఆధారిత రాకెట్ ఇంజిన్‌లను పరీక్షించడానికి ఈ కేంద్రం సహాయపడుతుంది.
అంతరిక్ష యాత్రలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సెంటర్ ఏర్పాటు వల్ల భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్, అధునాతన రాకెట్ ఇంజిన్ల అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆస్ట్రోబేస్ కంపెనీ.. ఫుల్-ఫ్లో స్టేజ్డ్ కంబషన్- FFSC ఇంజిన్ అది.
ప్రపంచంలో అత్యంత అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలలో ఒకటి. మీథేన్- ద్రవ ఆక్సిజన్‌ను ఉపయోగించడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఖర్చును తగ్గించనుంది. ఇంజిన్ పని తీరు, జీవితకాలాన్ని మెరుగుపరచనుంది. పరీక్ష కేంద్రం కేవలం ఇంజిన్లను పరీక్షించడానికి మాత్రమే కాదు, పెద్ద లక్ష్యానికి మద్దతు ఇవ్వనుంది.
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగ ఖర్చులను తగ్గించడానికి చాలా కీలకం కానుంది. ఆస్ట్రోబేస్ ఇప్పటికే అనేక మైలురాళ్లను దాటుతోంది. గతేడాది సెప్టెంబర్‌లో సబ్-స్కేల్ హాట్-ఫైర్ పరీక్ష విజయవంతమైంది. ఈ ఏడాదిలో పూర్తిస్థాయి ఇంజన్ పరీక్షల సెంటర్‌ని అభివృద్ధి చేస్తోంది. 2029 నాటికి ఉపగ్రహ ప్రయోగ సేవలలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ కంపెనీ.







