AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు రేవంత్ సర్కార్ భరోసా.. రూ. 5,563 కోట్లు రైతు భరోసా విడుదల..

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు చెప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లి సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మొత్తం రూ. 5,563 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుంది. సాగు పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్న రైతలన్నలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిధులను కేటాయించింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది.

 

రైతు భరోసా నిధుల విడుదల చేసిన అనంతరంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి వంటి కర్కోటక నాయకుడిని తాను ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. జగిత్యాలలో ఓటమి పాలైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎంతో గౌరవించిందని గుర్తుచేశారు. ఏడాది పాటు పదవి లేకపోతే ఓర్వలేక శత్రువులతో చేతులు కలిపి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

నలభై ఏళ్లుగా కార్యకర్తలు సేవలు చేస్తే.. కేవలం మంత్రి పదవి దక్కలేదన్న సాకుతో పార్టీని వీడటం అన్యాయమన్నారు. కరీంనగర్‌లో మాదిగ బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి ఇవ్వడం సహించలేకనే జీవన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 15 సార్లు బీ-ఫామ్ ఇచ్చి రాజకీయంగా అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోయారని ఆక్షేపించారు. ప్రజాపాలన పోవాలి.. పాపాల భైరవుడు రావాలి అన్నట్లుగా జీవన్ రెడ్డి తీరు ఉందని విమర్శించారు.

 

కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా..

 

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేస్తానని సీఎం సవాల్ విసిరారు. అప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారో చూస్తానని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ లక్ష కోట్లు తగలేసి కడితే అది నెలల వ్యవధిలోనే కూలేశ్వరంలా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ సంపదను పదేళ్లపాటు లూటీ చేసిన కేసీఆర్‌ను ఉరితీసినా తప్పులేదంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తామని సీఎ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10