లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పన్నిన కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దక్కాల్సిన రిజర్వేషన్లు వెంటనే దక్కకుండా పోయాయని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినప్పటికీ, బీజేపీ కావాలనే డీలిమిటేషన్ పేరుతో చిక్కుముళ్లు తెచ్చిపెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసిందని ఆరోపించారు. మహిళా సాధికారతపై బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి నేటి పరిణామాలతో తేలిపోయిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అనవసరంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంతో ముడిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదని, కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలని బీజేపీ చూసిందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం జారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయ స్వార్థానికి మహిళలు బలి
మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కళ్లారా చూశారని కేటీఆర్ అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం మహిళలను వాడుకుని, ఇప్పుడు వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ తన నిజాయతీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల నుంచే దాన్ని అమలు చేయాలని అన్నారు.
దేశంలోని అనేక పార్టీలు డీలిమిటేషన్ అనే అంశం అత్యంత సంక్లిష్టమైనదని చెప్పాయని తెలిపారు. ప్రస్తుత విధానంలో దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గడం ప్రమాదకరమని స్పష్టంగా చెప్పిన విషయాన్ని బీజేపీ గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని డీలిమిటేషన్ అంశంపై విస్తృతమైన చర్చ, సంప్రదింపులు చేపట్టాలని సూచించారు.
డీలిమిటేషన్ అంశంపై మొండిగా ముందుకుపోవడం కుదరదనే విషయం ఈరోజు లోక్ సభలో జరిగిన పరిణామాలను బట్టి బీజేపీ తెలుసుకోవాలని అన్నారు. దీనితో పాటు తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది మా రాష్ట్ర హక్కు అని కేటీఆర్ అన్నారు.
జమ్ము కశ్మీర్, అసోంలో దేశవ్యాప్త డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం, తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. మహిళా బిల్లుతో, దేశవ్యాప్త డీలిమిటేషన్ అంశం సంబంధం లేకుండా, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028 లోపు పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు








