ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా ఆయన ‘X’ వేదికగా షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఒక గాడిదకు మోటార్‌సైకిల్ సీటు, హ్యాండిల్‌బార్లు, హెడ్‌లైట్, ఇండికేటర్లు అమర్చి ఉన్న వింత ఫోటోను మార్చి 25న పోస్ట్ చేసిన ఆయన, దానికి కేవలం “Your comments #justasking” (మీ కామెంట్లు.. జస్ట్ అడుగుతున్నా) అని క్యాప్షన్ జోడించారు.
ఎలాంటి ప్రత్యక్ష వ్యాఖ్య లేకుండా, కేవలం ప్రజల స్పందన కోరుతూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దీనికి 3.54 లక్షలకు పైగా వ్యూస్, 8,480 లైకులు, 1,478 రీపోస్టులు, 3,500కు పైగా కామెంట్లు వచ్చాయి. గ్రామీణ వాతావరణంలో ఉన్న ఈ ‘గాడిద-బైక్’ హైబ్రిడ్ ఫోటోపై నెటిజన్లు తమ సృజనాత్మకతకు పదును పెట్టారు.
ఈ పోస్ట్ కింద కామెంట్ల సెక్షన్ ఫన్నీ మీమ్స్, ఎడిట్ చేసిన ఫోటోలు, రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో నిండిపోయింది. నిత్యం సామాజిక, రాజకీయ అంశాలపై తన గళం వినిపించే ప్రకాశ్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ చాలామంది కామెంట్లు చేశారు.
అత్యధికంగా 1,880 లైకులు పొందిన ఒక కామెంట్‌లో, “అబ్ నికల్ లో దోనో పాకిస్థాన్” (ఇప్పుడు మీరిద్దరూ పాకిస్థాన్‌కు వెళ్లిపోండి) అంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేశారు. మరికొందరు ప్రకాశ్ రాజ్‌ను నేరుగా ఉద్దేశించి “మీరు పాకిస్థాన్‌కు ఎప్పుడు వెళ్లారు?” అని ప్రశ్నించారు. ఇంకొక యూజర్, “మీలాంటి దేశ వ్యతిరేకి, హిందూ ద్వేషికి ఈ వాహనమే సరిగ్గా సరిపోతుంది” అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు.
సాధారణంగా ప్రకాశ్ రాజ్ వివాదాస్పద అంశాలపై #justasking అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజల అభిప్రాయాలను కోరుతుంటారు. ఈ పోస్ట్ కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో Xలోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర వేదికలపైనా విస్తృతంగా సర్క్యులేట్ అవుతూ, ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసింది.








