నారా రోహిత్ తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే దివంగత నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో జరిగిన తన తండ్రి స్మరణార్థం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా.. “సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. దీంతో భవిష్యత్తులో ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కనిపించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నారా రోహిత్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించి తన మద్దతును తెలిపారు. తన తండ్రి స్మృతివనం వద్ద నివాళులర్పించిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పటికీ తన తండ్రి జ్ఞాపకాలను పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రోహిత్ భార్య శిరీషతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని తన తండ్రికి నివాళులర్పించారు.
నారా రోహిత్ సినీ కెరీర్ విషయానికొస్తే.. ‘బాణం’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సోలో, ప్రతినిధి, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. గతేడాది ‘సుందరకాండ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం ‘భైరవం’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజా వ్యాఖ్యలతో ఆయన త్వరలోనే సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది.








