AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం: బీజేపీ కార్యాలయంలో రాజాసింగ్ సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ (BJLP) కార్యాలయానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో ఆయన సుమారు గంటకు పైగా భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన రాజాసింగ్.. బీజేఎల్పీ కార్యాలయం తన ‘పాత ఇల్లు’ అని, అక్కడి వారంతా తన పాత స్నేహితులని పేర్కొన్నారు. తన పాత మిత్రులను కలవడానికి వచ్చానని, ఇందులో ప్రత్యేక రాజకీయ కారణాలేమీ లేవని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడికి రావడంతో అసెంబ్లీ లాబీల్లో సందడి నెలకొంది. బీజేఎల్పీ కార్యాలయంలో ఉన్న రాజాసింగ్‌ను చూడగానే కేటీఆర్ నవ్వుతూ.. “సస్పెండ్ అయిన వ్యక్తివి లోపలికి ఎలా వెళ్తావు? బయటకు రా” అంటూ సరదాగా ఆటపట్టించారు. దీనికి స్పందనగా అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందిస్తూ.. “మీరు కూడా మా ఛాంబర్‌లోకి రావాలి” అని కేటీఆర్‌ను ఆహ్వానించడం అక్కడ నవ్వులు పూయించింది. ఈ పరిణామం అసెంబ్లీలో ఉత్కంఠత మధ్య కాసేపు ఆహ్లాదకర వాతావరణాన్ని నింపింది.

తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న వార్తలపై రాజాసింగ్ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతం తాను స్వేచ్ఛగా ఉంటూ మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని చెప్పారు. తనను బీజేపీలో చేర్చుకోమని తాను ఎవరినీ బతిమిలాడటం లేదని, భవిష్యత్తులో ఎవరు ఎవరిని బతిమిలాడుతారో కాలమే తేలుస్తుందని ఆయన తనదైన శైలిలో స్పష్టం చేశారు.

ANN TOP 10