మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సంచలన అంచనాలను వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోనీ జట్టులో ఉన్నప్పటికీ, ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్లేఆఫ్స్ చేరడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్‌కే, ఈసారి కూడా పుంజుకోవడం అంత సులభం కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే జట్లపై ఆకాష్ చోప్రా స్పష్టతనిస్తూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT), మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు టాప్-4లో నిలుస్తాయని జోస్యం చెప్పారు. మరీ ముఖ్యంగా, ఈసారి రిషబ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉందని ఆయన ప్రిడిక్ట్ చేశారు. అలాగే సంజూ శాంసన్ ఆరెంజ్ క్యాప్, జస్‌ప్రీత్ బుమ్రా పర్పుల్ క్యాప్ దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో నిరాశపరిచిన సీఎస్‌కే, ఈసారి జట్టులోకి సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ రావడంతో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మార్చి 28న బెంగళూరులో జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ధోనీ తన చివరి సీజన్‌ను ట్రోఫీతో ముగిస్తాడా లేదా ఆకాష్ చోప్రా చెప్పినట్లు సీఎస్‌కే వెనుకంజ వేస్తుందా అన్నది వేచి చూడాలి.








