AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సంచలనం: ఏపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో శనివారం జరిగిన డ్రగ్స్ పార్టీపై తెలంగాణ ‘ఈగల్ టీమ్’ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆంధ్రప్రదేశ్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానించిన పోలీసులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, డ్రగ్స్ తీసుకున్నట్లు ‘పాజిటివ్’ అని తేలింది. దీనితో పోలీసులు సుధీర్ రెడ్డిని మరియు ఆయనతో పాటు ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సుధీర్ రెడ్డి ఇలా డ్రగ్స్ కేసులో దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదని వెల్లడైంది. గతంలో కూడా రెండుసార్లు ఆయన మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడినట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వరుసగా మూడోసారి డ్రగ్స్ కేసులో చిక్కడం ఇప్పుడు అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. అరెస్టు అనంతరం నిబంధనల ప్రకారం సుధీర్ రెడ్డిని పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. వీరికి ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? అన్న కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

సుధీర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, ఎన్నికల సమయంలో తన తండ్రి ఆదినారాయణ రెడ్డి తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన సోదరుడి కుమారుడు భూపేష్ రెడ్డిని రాజకీయ వారసుడిగా ప్రోత్సహిస్తున్న తరుణంలో, సొంత కుమారుడు ఇలా డ్రగ్స్ కేసులో పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. చట్ట ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ANN TOP 10