పోలీసుల దర్యాప్తు ప్రకారం, పైరసీ సినిమాల వ్యాపారం ద్వారా రవి భారీగా ఆదాయాన్ని ఆర్జించాడు. సినిమాలను రెండు రకాలుగా కొనుగోలు చేసేవాడని, ఒక్కో క్యామ్ కార్డర్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చొప్పున చెల్లించేవాడని తేలింది. ఇలా తక్కువ ధరకు సినిమాలను సేకరించి, ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ప్రకటనల రూపంలో కోట్లాది రూపాయలు సంపాదించాడు. రవి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, మొత్తం రూ.13.40 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని టాక్స్ ఎగ్గొట్టేందుకు తన సోదరి ఖాతాలోకి (సుమారు రూ.90 లక్షలు) మళ్లించినట్లు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. పైరసీ ద్వారా వచ్చిన ఆదాయంతో రవి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడని, విదేశీ పర్యటనలు చేసినట్లు ఆధారాలు లభించాయి. అయితే, పోలీసులు ఇప్పటివరకు కేవలం రూ.3 కోట్లను మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. మిగిలిన నిధులు ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఆరా తీస్తున్నారు.
విచారణ సమయంలో రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదని సమాచారం. తనపై ఉన్నవన్నీ తప్పుడు కేసులని వాదించడమే కాకుండా, విచారణాధికారులపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడని రిపోర్టులో వెల్లడించారు. ఈ పైరసీ నెట్‌వర్క్‌లో రవితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న సర్వర్ల వివరాలు మరియు ఇతర నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.









