శ్రీనివాస గౌడ రికార్డు బద్దలు మంగళూరులో నిర్వహించిన కంబళ పోటీల్లో మస్తికట్టె స్వరూప్ అద్భుత ప్రదర్శన చేశాడు. 125 మీటర్ల దూరాన్ని ఆయన కేవలం 10.87 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో కంబళ వీరుడు శ్రీనివాస గౌడ 100 మీటర్ల దూరాన్ని 8.78 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించగా, తాజా గణాంకాల ప్రకారం స్వరూప్ 100 మీటర్ల మార్కును కేవలం 8.69 సెకన్లలోనే దాటేశాడు. దీంతో కంబళ చరిత్రలో అత్యంత వేగవంతమైన రన్నర్‌గా స్వరూప్ నిలిచాడు.
సీనియర్ విభాగంలో తొలి ప్రయత్నంలోనే విజయం స్వరూప్ గత మూడేళ్లుగా కంబళ పోటీల్లో పాల్గొంటున్నాడు. గతంలో జూనియర్ విభాగంలో సత్తా చాటిన ఆయన, ఈ ఏడాది తొలిసారిగా సీనియర్ విభాగంలో అడుగుపెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఏకంగా రికార్డు స్థాయి విజయాన్ని అందుకోవడం పట్ల స్వరూప్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయం తాను ఊహించలేదని, దున్నపోతుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నాడు. కంబళ అభిమానులు స్వరూప్ వేగాన్ని చూసి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తీర ప్రాంత సంప్రదాయ క్రీడ కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో కంబళ పోటీలు అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామీణ క్రీడలు. బురద పొలాల్లో దున్నపోతులతో కలిసి రన్నర్లు పరుగెత్తే ఈ పోటీలు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తాయి. ఏటా ఈ క్రీడల్లో అనేక మంది గ్రామీణ యువకులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. స్వరూప్ నెలకొల్పిన ఈ కొత్త రికార్డుతో కంబళ పోటీలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది.









