తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి నియమకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను రేవంత్‌రెడ్డి సర్కారు భర్తీ చేస్తున్నది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్‌గా జి చిన్నారెడ్డిని శనివారం నియమించింది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించింది. సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ రెడ్డికి ఈ అవకాశం కల్పించింది. గతంలో ఆయన విశాలాంధ్ర పత్రిక సంపాదకులుగా పని చేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రికకు ఎడిటర్‌గా ఉన్నారు. అయితే జీవో వెలువడిన తేదీ నుంచి రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అంతకు ముందు మీడియా అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ పని చేసిన విషయం తెలిసిందే.