జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత శోభన్ రెడ్డితో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లకు కూడా కాంగ్రెస్ కండువా కప్పి దీపా దాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం బీఆర్ఎస్‌కు జీహెచ్ఎంసీ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు గుడ్ బై చెప్పారు. పార్టీలో ఉద్యమ కారులకు మనుగడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు తీవ్రంగా బాధిస్తున్నాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం 2000 సంవత్సరం నుంచి పార్టీలో పని చేశానని అన్నారు.
మాతోనే బీఆర్‌ఎస్ పార్టీ మొదలైంది.. మాతోనే ముగుస్తుంది: శ్రీలత శోభన్ రెడ్డి
బీఆర్‌ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, తమకు సరైన న్యాయం జరగలేదని శ్రీలత శోభన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటికి నుంచి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందం కలిగిందన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడం రాజీనామా చేయడం జరిగిందని మోతే శోభన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని, ధన బలం ఉన్నటువంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం తమ తమ్ముడుతో మొదలైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఉద్యమ పార్టీగా బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడినప్పటికీ ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల కాంగ్రెస్ వైపు రావడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు సైతం రేవంత్ రెడ్డి పెద్దపిట్ట వేయనున్నారని ధీమాను వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో తమతోనే బీఆర్‌ఎస్ పార్టీ మొదలైందని, ఇప్పుడు మాతో ఆ పార్టీ ముగుస్తుందని మోతే శోభన్ రెడ్డి పేర్కొన్నారు.