AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి..!

ఉద్యోగులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) తో టీఎస్ఆర్టీసీ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రమాద బీమా రూ.40 లక్షల నుంచి కోటికి పెరిగింది. హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో శనివారం రోజున ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది.

ఎలాంటి ప్రీమియం చెల్లింపు లేకుండా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను పెంచడం శుభపరిణామని సజ్జనార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు.

యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో రూ.12 లక్షల బీమా అందుతుందని వివరించారు.

సిబ్బంది, ఉద్యోగుల శాల‌రీ అకౌంట్స్‌ను రెండేళ్ల క్రితం యూబీఐకి టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మార్చిందని, ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌక‌ర్యం ఉందని సజ్జనార్ చెప్పారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయే కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తోందని, వారు ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఈ ఉచిత ప్రమాద బీమా ఆసరాగా నిలుస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక‌ ప్రాధాన్యత‌నిస్తున్నట్లు గుర్తు చేశారు.

ANN TOP 10