హైదరాబాద్ నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడి మల్కాపూర్‌లోని అంకుర హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ మరిచిపోకముందే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించాయి. మాల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెకరేషన్లో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత షాపింగ్ మాల్ మొత్తం మంటలు భారీగా వ్యాపించాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు ఫైరింజినట్లు మంటలను ఆర్పివేసేందుకు తీవ్రమంగా శ్రమిస్తున్నారు.
అగ్ని ప్రమాదం కారణంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాల్ మూసే సమయంలో ప్రమాదం సంభవించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. కాగా, ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ఎవరికైనా ఎలాంటి గాయాలు జరిగాయా? అనేది తేలే అవకాశం ఉంది.









