వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023)లో బంగ్లాదేశ్ (Bangladesh) బోణీ కొట్టింది. అఫ్గానిస్తాన్ తో శనివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. రహ్మనుల్లా గుర్బాజ్ (62 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇతడు మినహా మిగిలిన ప్లేయర్లు దారుణంగా విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్, షకీబ్ ఉల్ హసన్ చెరో మూడు వికెట్లు సాధించారు. షోరిఫుల్ ఇస్లామ్ రెండు వికెట్లు అందుకున్నాడు. అనంతరం బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే నష్టపోయి 158 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నజ్ముల్ షాంటో (83 బంతుల్లో 59 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), మెహదీ హసన్ మిరాజ్ (73 బంతుల్లో 57; 5 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు బంగ్లాదేశ్ కు విజయాన్ని ఖాయం చేశారు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్తాన్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ గుర్బాజ్ మినహా మిగిలిన ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలం అయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు అఫ్గానిస్తాన్ బ్యాటర్లు చెమటోడ్చారు. బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు అఫ్గానిస్తాన్ తక్కువ పరుగులకే కుప్పకూలింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కు ఓపెనర్లు లిట్టన్ దాస్ (13), తన్జిద్ హసన్ (5) శుభారంభం చేయలేకపోయారు. వీరిద్దరు చాలా త్వరగా అవుటయ్యారు. అయితే మెహదీ హసన్ మిరాజ్, షాంటోలు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్ కు 97 పరుగులు జోడించారు. అనంతరం మెహదీ హసన్ పెవిలియన్ కు చేరాడు. కాసేపటికే కెప్టెన్ షకీబుల్ హసన్ (14) కూడా అవుటయ్యాడు. అయితే షాంటో మరో ఎండ్ లో ఉండి బంగ్లాదేశ్ ను విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.









