టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కి భారీ షాక్ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మహమ్మద్ అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగా అజార్ వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది.
కాగా, ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ ఎన్నికలకు గత నెల 30న నోటిఫికేషన్ విడుదలైంది. హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ నోటిఫికేషన్ జారీ చేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, ఈసీ పోస్టులకు అక్టోబర్ 11 నుంచి 13 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 16వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు.









