రంగంలోకి ప్రియాంక, డీకే
టీపీసీసీ చీఫ్ వ్యూహాత్మక అడుగులు
గెలుపే లక్ష్యంగా కీలక నిర్ణయాలు
అధిష్టానం సైతం తెలంగాణపై స్పెషల్ ఫోకస్
ఎన్నికల సమీపిస్తున్న వేళ టీ కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. టీపీసీసీ చీఫ్ బిగ్ స్కెచ్‌లో భాగమే కీలక నేతలు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. .
రేవంత్ రెడ్డి నేతృత్వంలో వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ వంటివారు కాంగ్రెస్ లో చేరిపోయారు. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ లో చేరతారని గట్టి టాక్ నడుస్తోంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సాయాన్ని కోరారని తెలుస్తోంది. తాజాగా బెంగళూరు వెళ్లిన రేవంత్.. డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. డీకేకు ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ పార్టీలో పేరుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో పీసీసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర డీకే శివకుమార్ దే. కొన్నాళ్లపాటు డీకేను రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో ఉండి అసెంబ్లీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని విన్నవించినట్టు తెలుస్తోంది. టికెట్ల కోసం భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేసుకోవడం, కొన్ని చోట్ల కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా దరఖాస్తు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై అనేక ఒత్తిళ్లు ఉన్నట్టు సమాచారం.
అసెంబ్లీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు అభ్యర్థులను ఫైనల్ చేయాలని డీకేని కోరినట్టు చెబుతున్నారు. డీకే శివకుమార్ పై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మంచి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో డీకే అభ్యర్థులను ఫైనల్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ముందుకు రారని.. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా డీకే శివకుమారే ఫైనల్ చేశారు కాబట్టి కాంగ్రెస్ అగ్రనేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండబోవనేది రేవంత్ అభిప్రాయమని అంటున్నారు. అందువల్లే డీకే శివకుమార్ ను రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు ఆహ్వానించారని అంటున్నారు. ఇక పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ చేత విస్తృతంగా ప్రచారం చేయించాలనే ఆలోచనలో పీసీసీ చీఫ్ ఉన్నట్లు తెలుస్తోంది.