డెలివరీ ఇద్దామని ఓ అపార్ట్మెంట్లోని మూడో ఫ్లోర్‌కి వెళ్లిన డెలివరీ బాయ్ మీదకు ఓ ఇంట్లో నుంచి పెంపుడు కుక్క రావడంతో భయంతో అతను కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ఆదివారం జరిగింది. మణికొండ పంచవటి కాలనీలో శ్రీనిధి హైట్స్ అపార్ట్మెంట్లోని మూడో ఫ్లోర్లో డాక్టర్ సుబ్బరామిరెడ్డి నివాసం ఉంటున్నాడు.
ఓ యాప్ లో ఆయన ఆర్డర్ పెట్టుకున్నాడు. ఆ ఆర్డర్ డెలివరీ చేసేందుకు ఫలక్‌నుమాకు చెందిన డెలివరీ బాయ్ మహమ్మద్ ఇలియాజ్(30) ఆదివారం మధ్యాహ్నం 2.25 గంటలకు అపార్ట్మెంట్ మూడో ఫ్లోర్‌కు చేరుకున్నాడు. ఒక్కసారిగా డాక్టర్ ఇంట్లో నుంచి అతని పెంపుడు కుక్క అరుస్తూ ఇలియాజ్ మీదకు దూసుకెళ్లబోయింది. భయంతో ఇలియాజ్ మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అతనికి ఒక కాలు విరిగిపోయిందని, బాధితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని రాయదుర్గం పోలీసులు చెప్పారు.









