అనేక అంటువ్యాధులు, రుగ్మతల నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయి. అందుకే చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి. అయితే వ్యాక్సిన్లు వేసే సమయంలో పిల్లలకు ఇబ్బందులు కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..
వ్యాక్సిన్‌కు వెళ్లేప్పుడు పిల్లల హెల్త్ రికార్డులను వెంట తీసుకెళ్లడం మరిచిపోవద్దు. ఆ వివరాల ఆధారంగానే వైద్యులు డోసేజీ నిర్ణయిస్తారు.
వ్యాక్సిన్ కోసం వెళ్లేటప్పుడు బిడ్డలకు వదులైన దుస్తులే వేయండి. సౌకర్యంగా ఉంటాయి. కాటన్ అయితే మరీ మంచిది.
వ్యాక్సినేషన్ తర్వాత ఏం తినిపించాలి, మలి విడత మళ్లీ ఎప్పుడు వేయించాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఆ సమయానికి వాడుతున్న ఔషధాలు ఆపేయాలా, కొనసాగించాలా? అన్నదీ తెలుసుకోండి.
అర్హులైన వైద్యులతోనే టీకాలు వేయించాలి. వ్యాక్సినేషన్ విషయంలో వాయిదాలు సరికాదు.
వ్యాక్సినేషన్ తర్వాత బిడ్డ శరీరంలో కానీ, ప్రవర్తనలో కానీ ఏవైనా మార్పులుంటే.. తక్షణం వైద్యులను సంప్రదించాలి.
ఎవరి శరీరతత్వం వారిదే. ఫలానా వాళ్ల పిల్లలకు అలా అయ్యింది కాబట్టి, మన బిడ్డకూ అలానే జరుగుతుంది.. అనుకోవడం తప్పు. ఎవరితోనూ పోల్చుకోవద్దు. అశాస్త్రీయమైన ఆలోచనా విధానం వద్దు.









