మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్ పర్సన్ సోనియాగాంధీ పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ మరణంతో తాను ఒక స్నేహితుడు, ఒక తత్వవేత్త, ఒక మార్గదర్శకుడ్ని కోల్పోయానని శుక్రవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జ్ఞానం, గొప్పతనం, వినయానికి ప్రతిరూపమైన మహా నాయకుడ్ని పార్టీ కోల్పోయిందని తెలిపారు.
దేశానికి, పార్టీకి ఆయన లోటు భర్తీ చేయలేనిదని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి, ప్రగతిలో ఆయన పాత్ర అపరిమితం అని తెలిపారు. హృదయపూర్వకంగా, తనదైన మనస్సుతో దేశానికి సేవ చేశారన్నారు. ఆయన కృషితో లక్షలాది మంది భారతీయులకు సాధికారత లభించిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, లౌకిక వాదం, ప్రజాస్వామ్య విలువలకు ఆయన కట్టుబడి పని చేశారన్నారు. అంతకు ముందు ఆమె మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయన పార్ధివ దేహానికి నివాళులర్పించారు.