మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సంతాపం తెలిపారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, పార్టీ నేతలు సంపత్ కుమార్, జేడీ శీలం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు వెంట టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు కూడా ఉన్నారు. వారు కూడా మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
దేశానికి మన్మోహన్ సింగ్ ఎన్నో సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఆయన లేకపోవడం దేశానికి తీరని లోటు అని చెప్పారు.